జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మొత్తం 15 రహదారులను జీవీఎంసీతో కలిసి విస్తరించాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించేందుకు భీమిలి బీచ్ రోడ్డును కలిపేలా కొన్ని రహదారులను, ఎన్‌ఏడీ వద్ద రద్దీ తగ్గించేందుకు అడవివరం నుంచి శొంఠ్యాం మీదుగా మరో రహదారి...ఇలా అవసరమైన మార్గాలను గుర్తించింది.
పెందుర్తి, ఆనందపురం, భీమిలి, డెంకాడ, విజయనగరం ప్రాంతాలను కలుపుతూ విస్తరించే ఈ 15 రహదారులకు రూ.403.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటిలో కొన్ని రహదారులు పంచాయతీరాజ్, మరికొన్ని ఆర్ అండ్ బి, ఇంకొన్ని జీవీఎంసీ నిర్వహణలో ఉన్నాయి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించనున్నారు. జాతీయ రహదారి, భీమిలి బీచ్ కారిడార్ 210 అడుగులు, బీఆర్‌టీఎస్ మార్గం 150 అడుగులకు విస్తరించి, మిగిలిన వాటిని రద్దీకి అనుగుణంగా 60 అడుగుల నుంచి 100 అడుగులకు అభివృద్ధి చేస్తారు.